Sunday, December 21, 2008

వీరతాళ్ళు–2: Sine, Cosine ల కథ.

డిసెంబరు 2008


ట్రిగొనామెట్రి లో వచ్చే sine, cosine అన్న మాటలు సంస్కృతం నుండి వచ్చేయని చెబితే ఎంతమంది నమ్ముతారు? భాస్కరాచార్య ఖగోళ పరిశోధనలు చేసేటప్పుడు త్రిభుజాల అవసరం తరచు వచ్చేది. అందులోనూ లంబకోణ త్రిభుజాలు మరీ ఎక్కువగా వచ్చేవి. లంబకోణ త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీలు. (డిగ్రీని తెలుగులో ఏమంటారో తెలుసా?) మిగిలిన రెండు కోణాలు 90 డిగ్రీల కంటె తక్కువ కనుక వాటిని లఘు కోణాలు అంటారు. ఈ లఘు కోణాలని కలుపుతూ ఉండే రేఖని కర్ణం (hypotenuse) అంటారు. భాస్కరాచార్యుల వారు చేసే లెక్కలలో ఒక కోణానికి ఎదురుగా ఉండే భుజం పొడుగుకి కర్ణం పొడుగుకి మధ్య ఉండే నిష్పత్తి పదే పదే వస్తూ ఉంటే అదేదో ముఖ్యమైన నిష్పత్తి అని భావించి దానికి ‘జీవ’ అని పేరు పెట్టేరాయన. జీవ అంటే ప్రాణం కనుక, ముఖ్యమైన వాటిని ప్రాణంతో పోల్చటం సబబే కదా! ప్రాణవాయువు (oxygen), ప్రాణ్యము (protein) అన్న పేర్ల లాంటిదే ఇదీను. వ్యాకరణంలో వచ్చే అచ్చులని ‘ప్రాణ్యములు’ అన్నట్లే అనుకొండి. కనుక భాస్కరాచార్యుల పుస్తకంలో ‘జీవ’ అంటే లంబకోణ త్రిభుజంలో ఒక కోణానికి ఎదురుగా ఉన్న భుజం పొడుగుని కర్ణం పొడుగు చేత భాగించగా వచ్చే లబ్దం. దీన్నే మనం ఈ నాడు sine అంటున్నాం. జీవ శబ్దం నుండి sine ఎలా వచ్చిందో ఇప్పుడు చెబుతాను.

భాస్కరాచార్యుల రోజులలో అన్ని దేశాల నుండి ప్రజలు భారతదేశం వచ్చి లెక్కలు నేర్చుకునేవారు. ఈ మాట మీద నమ్మకం లేకపోతే అరబ్బీ, పారశీక భాషలలో గణితాన్ని ‘హిన్‌సా’ అని ఎందుకు పిలుస్తారో అని ఆలోచించి చూడండి. అరబ్బీలో ‘హిన్‌సా’ అంటే హిందూ శాస్త్రం! లెక్కలలో భారత దేశం అంత గొప్పగా వెలిగిపోయిందా రోజులలో. ఈ అరబ్బీ దేశస్తులు మన దేశం వచ్చి, సంస్కృతంలో ఉన్న గణిత గ్రంధాలని పెద్ద ఎత్తున అరబ్బీ భాషలోకి తర్జుమా చేసి పట్టుకుపోయేవారు. ఇలా తర్జుమా చేసేటప్పుడు అరబ్బీ సంప్రదాయం ప్రకారం హల్లులని మాత్రమే రాసుకొని అచ్చులని రాసేవారు కాదు. చదివేటప్పుడు అచ్చులని సరఫరా చేసుకునేవారు. మొన్నమొన్నటి వరకు ఈ పద్ధతి టెలిగ్రాములు ఇచ్చేటప్పుడు వాడేవారు: strt immly అంటే వెంటనే బయలుదేరమని చెప్పటం కదా!

ఈ రకం ఆచారంలో కొన్ని ఇబ్బందులున్నాయి. ఉదాహరణకి అరబ్బీలో పుస్తకాన్ని “కితాబ్” (kitab) అంటారు, కాని రాసేటప్పుడు అచ్చులని మినహాయించి “క్‌త్‌బ్” (ktb) అని రాస్తారు. చదివేటప్పుడు ఇది కతబా (అతను రాసేడు), కుతుబ్ (పుస్తకాలు), కాతిబ్ (రాయసకాడు, రచయిత), మక్‌తాబ్ (కచేరీ, ఆఫీసు) లలో ఏదైనా కావచ్చు; సందర్భాన్ని బట్టి చదువరి సరి అయిన మాటని ఎన్నుకుంటాడు.

ఇదే విధంగా “జీవ” (jiva) అని రాయటానికి బదులు అరబ్బీలో “జ్‌వ్” (jv) అని రాసుకునేవారు. రాసినవాడికి (అరబ్బీ, సంస్కృతం వచ్చు కనుక) దీని అర్ధం తెలుసు, కాని మరొక సందర్భంలో, మరొక కాలంలో చదివేవాడికి jv అన్న మాట అర్ధం అయి చావలేదు. రాసిన వాడిని అడుగుదామా అంటే వాడు చచ్చి ఊరుకున్నాడాయె! ఏం చేస్తాం? ఆ jv ముందు, మధ్య, చివర రకరకాల అచ్చులని పెట్టి చూసేరు. ప్రయత్నించగా, ప్రయత్నించగా అరబ్బీ భాషలో ఒకే ఒక అచ్చుల జంట నప్పింది. అలా నప్పిన అచ్చులని jv తో కలగాపులగంగా కలపగా వచ్చిన మాట అర్ధం ‘చనుగవ’ లేదా ‘చనుకట్టు’! ప్రబంధాలలో ఏ వరూధినిని వర్ణించినప్పుడో అయితే ఏమో కాని గణిత శాస్త్రంలో చన్నులు ఎందుకు వచ్చేయో ఆ వ్యక్తికి అర్ధం కాలేదు. గత్యంతరం లేక jv ని ‘చనుగవ’ అనే అర్ధం వచ్చేలా అరబ్బీలోకి అనువదించేడు. అప్పటి నుండి అరబ్బీ కుర్రాళ్ళు గణిత శాస్త్రాన్ని ద్విగుణీకృతమైన ఉత్సాహంతో అధ్యయనం చేసి ఉండాలి మరి. (ఇంగ్లీషు కవులు కూడా ఆడదానిని నఖశిఖపర్యంతం మన వాళ్ళల్లా వర్ణించి ఉండుంటే నాకు ఇంగ్లీషు బాగా వచ్చి ఉండేదేమో!)

యూరప్‌లో ఉన్న వారికి ఎక్కడో దూరంలో ఉన్న ఇండియాలో మాట్లాడే సంస్కృతం రాదు కాని, పొరుగునే ఉన్న దేశాలలో మాట్లాడే అరబ్బీ వచ్చు. వాళ్ళు మన లెక్కలని అరబ్బుల దగ్గర నేర్చుకున్నారు. వాళ్ళ భాషలో చనుగవని వర్ణించటానికి వాడే మాట ఇప్పుడు మనం ఇంగ్లీషులో వాడే sinuous (ఒంపులు తిరిగినది) కి దగ్గరగా ఉంటుంది. కనుక వాళ్ళు చనుగవ ని sinuous అని తర్జుమా చేసేరు. అందులోంచే sine అన్న మాట వచ్చింది. మన ముక్కునీ, చెవులనీ కలుపుతూ మెలికలు (ఒంపులు) తిరిగిన సొరంగాలని sinuses అనటానికి కూడ మూలం ఇదే.
మరి cosine సంగతి ఏమిటని అడగకండి. మీరు ఊహించుకొండి. నా ఊహ ప్రకారం భాస్కరాచార్యులవారు ‘జీవ’ తో పాటు ‘సహజీవ’ ని కూడా వాడి ఉంటారు. అది అరబ్బీలో shjb అయి ఉంటుంది. అందులోంచే cosine వచ్చి ఉంటుంది (కోసెస్తున్నాను, మరోలా అనుకోకండి!). ఇలాగే tangent కి కూడ ఇటువంటి సిద్ధాంతం ఒకటి నా దగ్గర ఉంది కానీ, ఎందుకైనా మంచిది, ఇప్పుడు చెప్పను; మరోసారి చెబుతాను.

Saturday, December 20, 2008

వీరతాళ్ళు-1: (కారొనర్, కరణం, కలక్టర్, మరణ విచారణాధికారి)

డిసెంబరు 2008


నేను "ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు" ప్రచురించి ఆ ప్రతులని అమ్మటానికి ప్రయత్నించినప్పుడు "నా పుస్తకం ప్రతులు కొన్నవారికి 24x7 (అంటే ఏ రోజైనా, ఇరవైనాలుగు గంటలూ) సలహాలు ఇవ్వటానికి అందుబాటులో ఊంటాను" అని ఒక మాట ఇచ్చేను. ఈ మాటని దృష్టిలో పెట్టుకునో, మరెందువల్లో, తరచుగా నాకు వి-టపాలు వస్తూనే ఉంటాయి: "అయ్యా! ఈ మాటకి తెలుగేమిటి? ఆ పదబంధాన్ని తెలుగులో ఏమనాలి?"

ఉదాహరణకి ఈ మధ్యే ఒకరు పత్తేదారీ కథ రాయటానికి కాబోలు "coroner ని తెలుగులో ఏమనాలి?" అంటూ వాకబు చేసేరు. పెరీ మేసన్ పుస్తకాలు చదివిన వారందరికీ ఈ మాటకి అర్ధం తెలిసే ఉంటుంది. టూకీగా చెప్పాలంటే ఖూనీలు జరిగినప్పుడు శవపరీక్ష చెసే శాఖకి అధికారి coroner.

ఈ coroner అన్న మాట crown (అంటే కిరీటం) కి బ్రష్ట రూపం. మొదట్లో ఈ పని చేసే వ్యక్తిని లేటిన్ భాషలో "custos placitorum coronas" అనే వారు. ఇది ఇంగ్లీషులో క్రమేపీ coronator, crowner, coroner గా మారుకుంటూ వచ్చింది. కనుక coroner అంటే కిరీటం (రాజు కానీ, రాణీ కానీ) తరఫున పని చేసే వ్యక్తి. మొదట్లో ఈ coroner ఉద్యోగం పన్నులు వసూలు చెయ్యటం. మన దేశంలో మొన్నమొన్నటి వరకు ఉండిన "కరణం" అన్న మాట కూడ ఈ coroner నుండే పుట్టి ఉంటుందని నా అనుమానం.

క్రమేపీ పన్నుల వసూళ్ళు దగ్గనుండి ఇతర రంగాల్లోకి ఈ coroner బాధ్యతలు పెరుగుకుంటూ వచ్చేయి. ఇలా సంతరించిన బాధ్యతలలో నేరస్తులని దగ్గర ఉండి ఉరి తీయించి, అలా ఉరి తీయబడ్డ వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ప్రభుత్వం కబళించటం ఒకటి. రాచరికం కనుమరుగయి ప్రజాస్వామ్యం పట్టు పెరిగే సరికి ఈ coroner బాధ్యతలలో పట్టు సడలటం మొదలయింది. అనుమానాస్పద పరిస్థితులలో సంభవించిన మరణాలకి కారణాలు విచారించటం ఒక్కటే coroner బాధ్యతగా మిగిలింది.

ఆశ్చర్యం ఏమిటంటే రాచరికానికీ, ఇంగ్లండు కీ ఎదురు తిరిగి ప్రజాస్వామ్యం స్థాపించి, ఇంగ్లీషు వాడి భాషని కూడ తిరస్కరించి అమెరికా ఇంగ్లీషుని తయారు చేసుకుని, ఇంగ్లీషు వాడు రోడ్డుకి ఎడం పక్కని నడిపితే దానికి తిరకాసుగా కుడి పక్కని నడిపి, ఇంగ్లీషు వాడి పద్దతిని అన్ని విధాలా ఎదిరించిన అమెరికా వాడు ఈ coroner అన్న మాటనీ, ఆ పదవినీ, ఆ పదవితో వచ్చిన బాధ్యతనీ అలాగే ఏ మార్పూ లేకుండా అట్టేపెట్టేడు. ఈ పదవిని ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో coroner అని పిలచినప్పటికీ, చాల చోట్ల ఆ మాటకి బదులు ఇంకా అధునాతనమైన medical examiner అన్న మాటని వాడుతున్నారు.

ఈ నేపధ్యం తెలుసుకున్నాం కనుక ఇప్పుడు coroner ని తెలుగులో ఏమనాలో విచారిద్దాం. Coroner అన్న మాట యొక్క అసలు అర్ధానికి సమీపంగా ఉండే తెలుగు మాట కరణం. పన్నులు వసూలు చేసే కారొనరూ, కరణమూ ఇద్దరూ మరణ విచారణ లేకుండానే చచ్చిపోయేరు. ప్రస్తుతపు coroner ని "మరణ విచారణాధికారి" అని తెలిగించవచ్చు.

ఈ విచారణలో మనకి కాకతాళీయంగా మరొక ఉపలభ్ది (by-product) దొరికింది. మనం collector అన్న ఇంగ్లీషు మాటని మొహమాటం లేకుండా వాడేసుకుంటున్నాం - దానికి సమానార్ధక మయిన బ్రహ్మండమయిన దేశవాళీ తెలుగు మాట ఉండగా! ఆ మాటేమిటో చెప్పుకొండి చూద్దాం!!

అదే - కరణం.

మనం కలక్టర్ గారిని "కరణం" అంటే ఆయన (ఆమె) తోకతొక్కిన తాచులా చర్రున లేస్తాడు (లేస్తుంది). ఆ "కలక్టర్" లో ఉన్న status "కరణం" కి ఎలా వస్తుంది?