Saturday, December 20, 2008

వీరతాళ్ళు-1: (కారొనర్, కరణం, కలక్టర్, మరణ విచారణాధికారి)

డిసెంబరు 2008


నేను "ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు" ప్రచురించి ఆ ప్రతులని అమ్మటానికి ప్రయత్నించినప్పుడు "నా పుస్తకం ప్రతులు కొన్నవారికి 24x7 (అంటే ఏ రోజైనా, ఇరవైనాలుగు గంటలూ) సలహాలు ఇవ్వటానికి అందుబాటులో ఊంటాను" అని ఒక మాట ఇచ్చేను. ఈ మాటని దృష్టిలో పెట్టుకునో, మరెందువల్లో, తరచుగా నాకు వి-టపాలు వస్తూనే ఉంటాయి: "అయ్యా! ఈ మాటకి తెలుగేమిటి? ఆ పదబంధాన్ని తెలుగులో ఏమనాలి?"

ఉదాహరణకి ఈ మధ్యే ఒకరు పత్తేదారీ కథ రాయటానికి కాబోలు "coroner ని తెలుగులో ఏమనాలి?" అంటూ వాకబు చేసేరు. పెరీ మేసన్ పుస్తకాలు చదివిన వారందరికీ ఈ మాటకి అర్ధం తెలిసే ఉంటుంది. టూకీగా చెప్పాలంటే ఖూనీలు జరిగినప్పుడు శవపరీక్ష చెసే శాఖకి అధికారి coroner.

ఈ coroner అన్న మాట crown (అంటే కిరీటం) కి బ్రష్ట రూపం. మొదట్లో ఈ పని చేసే వ్యక్తిని లేటిన్ భాషలో "custos placitorum coronas" అనే వారు. ఇది ఇంగ్లీషులో క్రమేపీ coronator, crowner, coroner గా మారుకుంటూ వచ్చింది. కనుక coroner అంటే కిరీటం (రాజు కానీ, రాణీ కానీ) తరఫున పని చేసే వ్యక్తి. మొదట్లో ఈ coroner ఉద్యోగం పన్నులు వసూలు చెయ్యటం. మన దేశంలో మొన్నమొన్నటి వరకు ఉండిన "కరణం" అన్న మాట కూడ ఈ coroner నుండే పుట్టి ఉంటుందని నా అనుమానం.

క్రమేపీ పన్నుల వసూళ్ళు దగ్గనుండి ఇతర రంగాల్లోకి ఈ coroner బాధ్యతలు పెరుగుకుంటూ వచ్చేయి. ఇలా సంతరించిన బాధ్యతలలో నేరస్తులని దగ్గర ఉండి ఉరి తీయించి, అలా ఉరి తీయబడ్డ వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ప్రభుత్వం కబళించటం ఒకటి. రాచరికం కనుమరుగయి ప్రజాస్వామ్యం పట్టు పెరిగే సరికి ఈ coroner బాధ్యతలలో పట్టు సడలటం మొదలయింది. అనుమానాస్పద పరిస్థితులలో సంభవించిన మరణాలకి కారణాలు విచారించటం ఒక్కటే coroner బాధ్యతగా మిగిలింది.

ఆశ్చర్యం ఏమిటంటే రాచరికానికీ, ఇంగ్లండు కీ ఎదురు తిరిగి ప్రజాస్వామ్యం స్థాపించి, ఇంగ్లీషు వాడి భాషని కూడ తిరస్కరించి అమెరికా ఇంగ్లీషుని తయారు చేసుకుని, ఇంగ్లీషు వాడు రోడ్డుకి ఎడం పక్కని నడిపితే దానికి తిరకాసుగా కుడి పక్కని నడిపి, ఇంగ్లీషు వాడి పద్దతిని అన్ని విధాలా ఎదిరించిన అమెరికా వాడు ఈ coroner అన్న మాటనీ, ఆ పదవినీ, ఆ పదవితో వచ్చిన బాధ్యతనీ అలాగే ఏ మార్పూ లేకుండా అట్టేపెట్టేడు. ఈ పదవిని ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో coroner అని పిలచినప్పటికీ, చాల చోట్ల ఆ మాటకి బదులు ఇంకా అధునాతనమైన medical examiner అన్న మాటని వాడుతున్నారు.

ఈ నేపధ్యం తెలుసుకున్నాం కనుక ఇప్పుడు coroner ని తెలుగులో ఏమనాలో విచారిద్దాం. Coroner అన్న మాట యొక్క అసలు అర్ధానికి సమీపంగా ఉండే తెలుగు మాట కరణం. పన్నులు వసూలు చేసే కారొనరూ, కరణమూ ఇద్దరూ మరణ విచారణ లేకుండానే చచ్చిపోయేరు. ప్రస్తుతపు coroner ని "మరణ విచారణాధికారి" అని తెలిగించవచ్చు.

ఈ విచారణలో మనకి కాకతాళీయంగా మరొక ఉపలభ్ది (by-product) దొరికింది. మనం collector అన్న ఇంగ్లీషు మాటని మొహమాటం లేకుండా వాడేసుకుంటున్నాం - దానికి సమానార్ధక మయిన బ్రహ్మండమయిన దేశవాళీ తెలుగు మాట ఉండగా! ఆ మాటేమిటో చెప్పుకొండి చూద్దాం!!

అదే - కరణం.

మనం కలక్టర్ గారిని "కరణం" అంటే ఆయన (ఆమె) తోకతొక్కిన తాచులా చర్రున లేస్తాడు (లేస్తుంది). ఆ "కలక్టర్" లో ఉన్న status "కరణం" కి ఎలా వస్తుంది?

3 comments:

 1. భలే సంగతి చెప్పారు.

  ReplyDelete
 2. ఈ కలెక్టర్-కరణం విషయమై,
  నేను మొన్ననే ఎక్కడో చదివాను- చౌత్ అంటే పన్ను అని. చౌదరి అంటే పన్ను వసూలు చేసేవాడని. అంటే tax collector అని. అలా చౌదరీ అనే మాట క్రమేణ ఒక కుల సూచకంగా మారిందని.

  మీరు "ఆ మాటేమిటో చెప్పుకొండి చూద్దాం!!" అనగానే, నేనది చౌదరి ఏఁవో అనుకున్నాను.

  ఇంకొ గమ్మత్తైన విషయం, మొన్నవరో వారబ్బాయికి నవనీత్ చౌదరి అని పేరు పెట్టుకున్నారు, దాని అర్థమేమిటో అని నన్నవరో అడిగితే.

  నవనీతం అంటే వెన్న. నవనీత చోర అంటే కృష్ణుడి పేరు. ఇలా సగం పేర్లు పెట్టుకోవడం తోనే వచ్చింది చిక్కు అని ముందు వివరించాను.
  ఇక చౌదరి అంటే collector అని. కాబట్టి కుఱ్ఱాడి పేరు butter collector అవుతుందని వివరించాను. పోనీలే, ఈ పేరు కూడా వెన్నదొంగలాగానే వుంది. మఱీ దొంగిలించకుండ, ఇతడు వసూలు చేస్తాడు అని అనుకున్నాం. అన్నట్టు ఆ పిల్లాడి ముత్తాతలకు పాల వ్యాపారం వుండేదండోయ్ :) అలా అనుకోకుండా వాళ్ళ తాతలకు ట్రిబ్యూట్‌గా నిలిచింది ఆ పేరు. :)

  ReplyDelete
 3. రాకేశ్వరరావు గారూ

  నేను విన్నది ఏమిటో తెలుసా? చౌదరి అన్న మాట "చోదరి" కి బ్రష్ట రూపం. చోదరి అంటే driver అనే అర్ధం చెప్పుకోవచ్చు. కనుక "చౌదరి" అంటే driver అని నా అనుమానం. పార్శీ వాళ్ళల్లో ఈ రకం పేర్లు కనిపిస్తూ ఉంటాయి: కంట్రాక్టర్, మర్చెంట్, మొదలైనవి. వృత్తిని సూచించే పేర్లు అన్ని సంఘాలలోనూ కనిపిస్తూ ఉంటాయి.

  ReplyDelete