Saturday, February 21, 2009

వంద అనాలా? నూరు అనాలా?

ఫిబ్రవరి 2009

ఈమధ్య అంకెల మీద మూడు బ్లాగులు రాసేను. ఆ సందర్భంలో చిన్న అనుమానం పుట్టి కుమ్మరి పురుగులా గొలకటం మొదలు పెట్టింది. తొంభయ్ తొమ్మిది తరువాత వచ్చే సంఖ్యని "వంద" అనాలా? నూరు అనాలా? లేక "వంద" అని కొన్ని సందర్భాలలోనూ, "నూరు" అని కొన్ని సందర్భాలలోనూ అనాలా?

మన సాహిత్యంలోనూ, సంప్రదాయాలలోనూ "నూరు" ఎక్కువగా కనిపిస్తుంది. "నూటపదహారులు", "నూటికీ కోటికీ", "నెలఒక్కంటికి నూటికి వడ్డీ", మొదలైన వాడుకలు దీనికి ఉదాహరణలు. లెక్కపెడుతూన్నప్పుడు "తొంభయ్ తొమ్మిది" తరువాత వచ్చేది "నూరు" - ఎందుకంటే నూరు తరువాత "వందొకటి, వందరెండు అని ఎవ్వరూ అనగా నేను వినలేదు. నూటఒకటి, నూటరెండు, ... నూట తొంభయ్ తొమ్మిది, అనే అంటాం. అటుపైన "రెండు నూర్లు" అనం, "రెండు వందలు" అంటాం. అటుపైన ఎంత పెద్ద సంఖ్య చెప్పవలసి వచ్చినా ఆ పదబంధంలో "వంద" వస్తుంది కాని "నూరు" రాదు: "పదహేరు వేల నాలుగు వందల పన్నెండు", పదహేరు వేల నూట పన్నెండు" ని పోల్చి చూడండి.

ఎందుకు ఈ నియమం వచ్చిందో తెలియదు. ఇది విచారించేలోగా ఈ "వంద" ఎక్కడనుండి వచ్చిందో చూద్దాం. నూరు-వంద పర్యాయ పదాలు అయినప్పటికీ "నూరు" పక్కా తెలుగు మాట, వంద సంస్కృతంలోచి దిగుమతి అయి, రూపాంతరం చెందిన మాట.

సంస్కృతంలో "బృంద" కి పర్యాయ పదమైన "వృంద" తెలుగులోకి వచ్చి "వంద" అయింది.
"బృంద" అంటే "మూక", లేదా, "ఒకటికి మించి ఎన్నో" అని అర్ధం. బృందగానం అన్న మాట ఈ బృంద లోంచే వచ్చింది. కనుక ఒక విధంగా చూస్తే, "వంద" అంటే "చాలా" అని అర్ధం.

మన తెలుగు వాళ్ళకి తెలుగు తప్పించి మరే భాషా పదమైనా ఇష్టమే కనుక, ఈ వెనకొచ్చిన "వంద" ముందొచ్చిన "నూరు" మీద తురుఫు ముక్కలా పని చేస్తోంది.

"మీరు మరీనండీ. శోద్యం కాకపోతేను. ఏదీ "పందొమ్మిదివందల నలభై ఏడు" ని "వంద" లేకుండా అనండి చూద్దాం" అని సవాలు చేసేడు మావాడొకడు. దీన్ని రాయలసీమలో "వెయ్యిన్నీ తొమ్మన్నూట నలభై ఏడు" అంటారు ట. సాగరాంధ్రుల చెవికి ఇది కొంచెం funny గానే అనిపిస్తుంది. కాని సాగరాంధ్రుల చెవికి తెలుగే funnyగా వినిపిస్తోందీ రోజుల్లో.

ఇంతకీ మనకి రెండు మాటలు ఉన్నాయి కనుక "వంద" ని ఏ సందర్భంలో వాడటమో, "నూరు" ని ఏ సందర్భంలో వాడటమో నిర్ణయించుకుంటే బాగుంటుందేమో. ఎవ్వరైనా సలహాలు ఉంటే పారెయ్యండి.

Friday, February 13, 2009

మాటల అర్ధాలలో వచ్చే పెను మార్పులు

ఫిబ్రవరి 2008

కాలం నడుస్తూన్నకొద్దీ భాష మారుతుంది. కనీసం అరవై ఏళ్ళు పైబడ్డవాళ్ళు ఈ దృగ్విషయాన్ని (phenomenon) తమ తమ అనుభవాల్లోనే చూసి ఉంటారు. ఈ మార్పులకి అనేక కారణాలు ఉండొచ్చు.

అలాగే ఒక భాషనుండి మరొక భాషలోకి మాటలు వెళ్ళినప్పుడు ఆ మాట ఉచ్చారణలోనూ, వర్ణక్రమంలోనూ, అర్ధంలోనూ కూడా మార్పుకి గురికావచ్చు. రెండు మూడు భాషలతో పరిచయం ఉన్న వాళ్ళకి ఈ విషయం అవగతం అవుతుంది.

కొన్ని ఉదాహరణలు: సంస్కృతంలో "అదృష్టం" అంటే కనబడనిది. తెలుగులో కలిసి రావటం. సంస్కృతంలో "అనుమానం" అంటే evidence. ఉదాహరణకి, ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, వగైరా. తెలుగులో ఈ మాటకి "సందేహం" అని అర్ధం. సంస్కృతంలో "ఉద్యోగం" అంటే పూనిక లేదా effort. "ఉద్యోగ విజయాలు" అన్నప్పుడు ఈ సంస్కృత అర్ధమే చెప్పుకోవాలి. తెలుగులో ఉద్యోగం అంటే జీవనోపాధికి చేసే పని. స్థూలంగా చూస్తే రెండు అర్ధాలూ ఒకటే కాని సందర్భానుసారంగా అర్ధంలో కొద్ది మార్పు వచ్చింది.

సంస్కృతంలో "గ్రహచారం" అంటే గ్రహాల కదలిక. తెలుగులో "వాడి గ్రహచారం అలా తగలడింది" అంటే వాడి "అదృష్టం" బాగులేదని. ఇక్కడ గ్రహచారం అంటే fate అనే అర్ధం స్పురించటమే కాకుండా ఆ fate బాగులేదని కూడా అర్ధం వస్తోంది. ఎందుకు ఈ మార్పు ఇలా జరిగిందీ అని ఆలోచిస్తే మన జాతకాలలో గ్రహాల పాత్ర ఉందనే నమ్మకమే దీనికి కారణం. ఆ నమ్మకం లేకపోతే ఈ మార్పు జరిగి ఉండేది కాదు.

సంస్కృతంలో "పూజ్యం" అంటే పూజనీయం, పూజించదగ్గది. తెలుగులో "శూన్యం, సున్న, ఏమీలేదు" అనే అర్ధం. ఈ మార్పు ఎలా వచ్చిందో అర్ధం కాలేదు.

సంస్కృతంలో "ముష్టి" అంటే పిడికిలి (ముష్టి యుద్ధం). పిడికెడు గింజలు వేస్తారు కనుక తెలుగులో "బిచ్చం" అనే అర్ధంలోకి దిగజారింది.

తెలుగులో పూర్వం "అవ్వ" అంటే తల్లి. ఇప్పుడు నాయనమ్మ లేక అమ్మమ్మ అనే అర్ధం. లేకపోతే ఏ ముసలిదానినేనా అవ్వ అనొచ్చు. "కంపు" అంటే కమ్మటి వాసన అని ప్రాచీనార్ధం, ఇప్పుడు చెడు వాసన. తగవు అంటే న్యాయం అని పూర్వకాలపు అర్ధం, జగడం, వివాదం అని నేటి అర్ధం.

కోక అంటే ఆడ, మగ ధరించే బట్ట. "కుల్లాయించితి, కోకజుట్టితి.." ఇప్పుడు కోక అంటే చీర. చీర అన్న మాట కూడా ఆడ, మగ ధరించే బట్టకి వాడేవారు. అదికూడా ఇప్పుడు స్త్రీ ధరించే వస్త్రమే.

ఇంగ్లీషులో కూడ ఇటువంటి అర్ధ విపరిణామం తప్పదు. నేను అమెరికా వచ్చిన కొత్తలో gay అంటే happy అని అర్ధం. ఇప్పటి కొత్త అర్ధం అందరికి తెలుసు.

ఈ ఉదాహరణలని బట్టి నాకు తెలిసినదేమిటంటే దేశ, కాల పరిస్థితులతో మాటు మాటల అర్ధాలు మారుతాయి; ఆడువారి మాటలకే కాదు, అందరి మాటలకీ అర్ధాలు మారుతాయి. కొంచెం వైజ్ఞానిక దృష్టితో పరిశీలించాలంటే ఈ మార్పుని రకరకాల కోణాల నుండి చూడవచ్చు.

అర్ధం వ్యాకోచించటం:

చెంబు అంటే ఎర్రటి లోహంతో చేసిన రాగి పాత్ర అని అసలు అర్ధం. ఇప్పుడు కంచు చెంబు, ఇత్తడి చెంబు, వెండి చెంబు, అంటూ అన్ని రకాల పాత్రలకీ వాడుతున్నాం కదా. కాని చెంబు అంటే ఒక రకమైన ఆకారం మన బుర్రలో పడిపోయింది: గుండ్రంగా, చలివిడి ముద్ద ఆకారంలో, ఉంటే చాలు అది ఏ పదార్ధంతో చేసినా చెంబే. కొన్నాళ్ళు పోతే ప్లేస్టిక్ చెంబులు వచ్చినా వస్తాయి.

నూనె అన్న మాట నూ + నెయ్ అనగా నువ్వుల నుండి తీసిన "నెయ్యి" లేదా చమురు. (నూ పప్పు అంటే నువ్వుల పప్పు అని అర్ధం ఉంది కదా.) ఇప్పుడు ఏమయిందీ? "నెయ్" ని నెయ్యి చేసి అది వెన్న కరిగించగా వచ్చిన చమురు కి వాడటం మొదలు పెట్టేం. "నూ" కాస్తా "నూనె" అయింది. ఈ నూనె నువ్వుల నుండే రానక్కరలేదు. వేరుసెనగ, ఆముదం, నిమ్మగడ్డి, పత్తి గింజలు, ఇలా ఎక్కడ నుండి లభించిన చమురయినా నూనే. అంతే కాదు; మట్టి నూనె, కిరస నూనె అన్న పదాలు కూడ వాడుకలోకి వచ్చేసేయి కదా.

ఈ పద్ధతి సంస్కృతంలో కూడ పని చేస్తుంది. తిలలు నుండి తీసిన చమురు తైలం. కర్పూర తైలం, ఏరండ తైలం, మృత్తిక తైలం, వగైరాలు తిలలు నుండి రాలేదు కదా. ఈ తైలం అన్న మాట యొక్క అర్ధం ఇంకా విస్తృతం అయి "లంచం" అనే అర్ధంలో కూడ వాడబడుతోంది. ఈ విపరీత పరిణామానికి కారణం ఇంగ్లీషు భాషా ప్రభావం అని నా అనుమానం. ఇంగ్లీషులో "grease the palms" అనే పదబంధం ఉంది. ఇది మన నుండి వారికి వెళ్ళిందో వారి నుండి మనకి వచ్చిందో తెలియదు కాని రెండు భిన్న సంస్కృతులవారు "తైలం" అర్ధాన్ని ఒకే దిశలో వ్యాపింపచెయ్యటం కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే.

పోతే, సంస్కృతంలో చేటిక అంటే దాసి అనే పరిమితార్ధమే ఉంది. అది తెలుగులోకి వచ్చి "చేడియ" గా మారి అర్ధంలో విస్తృతి పొంది ఇప్పుడు ఏ స్త్రీ నయినా సూచించటానికి వాడబడుతోంది. మనం ఈ రెండింటిని ఎక్కువగా వాడటం లేదు కనుక సరదాగా stewardess అన్న మాటకి "చేటిక" అనో, చేడియ అనో అంటే బాగుంటుందేమో!

అర్ధ సంకోచం:

కోక, చీర అన్న మాటలు ఇప్పుడు ఆడువారి వస్త్రాలకే పరిమితి కావటం ఒక ఉదాహరణ.

పారశీక భాషలో "ఉస్తాద్" అంటే ఉపాధ్యాయుడు. ఇది తెలుగులో "వస్తాదు" గా మారింది. మొదట్లో ఈ మాటని మల్ల విద్య బోధించే వారికి వాడేవారు. క్రమేపీ మల్లవిద్యతో సంబంధం లేకపోయినా "ప్రవీణుడు" అనే పరిమితార్ధానికి దిగజారిపోయింది. ఉదాహరణ: ఉస్తాద్ ఆలీ అక్బర్ ఖాన్.

సభ్యోక్తులు

కొన్ని మాటలు అశుభ సూచకాలు కావచ్చు. కొన్ని అశ్లీల పదాలనిపించవచ్చు. ఏడు ని ఆరున్నొక్కటి అనటం, "లేవు" అనటానికి "నిండుకున్నాయి" అనటం ఈ జాతివి.

ఇక్కడ అసభ్యోక్తుల గురించి సోదాహరణంగా రాయబోతున్నాను కనుక అభ్యంతరం ఉన్నవారు ఇటుపైన చదవకండి. మీకు కోపం వస్తే నన్ను మన్నించెయ్యండి - ఈ సారికి.

కొన్ని మాటలు తెలుగులో అంటే మరీ నాటుగా ఉంటుందని సంస్కృతంలోనో, ఇంగ్లీషులోనో అంటూ ఉంటాం. ఉచ్చ అన్న మాట అనటానికి ఇచ్చగించనివారు ఒంటేలు అనో, ఒకటికి అనో, అల్పాచిమానం అనో అంటూ ఉంటారు.

"మా దొడ్లో కాసిన కూరగాయలు" అన్నప్పుడు పరవా లేదు కాని చెంబుచ్చుకుని బయటకి వెళ్ళేటప్పుడు "దొడ్డికి వెళుతున్నాను" అంటే నాటుగా ఉంటుందని మా ఇంట్లో అంటారు. మలమూత్రాదుల విసర్జన శరీర కర్మలు; వాటి గురించి మాట్లాడటానికి మనవాళ్ళకి సిగ్గు, అందుకని ఇంగ్లీషులో లంకించుకుంటారు. మా పెద్ద సంతానం పుట్టినప్పుడు "పిల్ల దొడ్డికెళ్ళింది" అంటే మా ఆవిడ ఛర్రుమని లేచేది (ఇంకెవరి మీదకి, నా మీదకే!) "డయపరు పాడు చేసుకుంది" అనలేరూ?" అని గదమాయించింది. "డయపరు రెండు విధాలుగా పాడు చేసుకోవచ్చు కదా?" అని నేను సందేహం వెలిబుచ్చితే, "ఒకటికి వెళితే తడిపేసుకుంది" అనండి!" అంది. నేను కంప్యూటరు వాడినేమో, నాకిచ్చే ఆదేశాలు సందిగ్ధం లేకుండా ఉండాలి. అందుకని, "మరి రెంటికి వెళితేనో?" అనడిగితే, "దానిని బవెల్ మూవ్‌మెంటు అయింది" అనండి అని నాకు మాట్లాట్టంలో మెళుకువలు నేర్పింది.

ఒక రోజు ఎవ్వరో బంధువులు ఇంటికి వచ్చేరు. అంతా భోజనాలు చేస్తున్నారు. తల్లికి శాపం ఉందిట. నోట్లో ముద్ద పెట్టుకోగానే "పిల్లకి బవల్ మూవ్‌మెంటు అయింది. భోజనాలు అయేదాకా ఆగుదామా?" అని అమాయకంగా అడిగేను. ఆలస్యం చేస్తే పిల్ల పిర్రలకి "రేష్ వస్తూందేమో అని భయం. (ఇక్కడ పిర్రలు అనొచ్చో అనకూడదో? ఒక సారి "పిర్రలు" అని ఒక తెలుగు కథలో వాడితే, "మరీ un-victorian గా ఉంది, పిరుదులు అనో, బటక్స్ అనో మార్చుదురూ" అని ఒకరు సలహా ఇచ్చేరు.)

"అదేమిటి. అసహ్యంగా! అందరూ భోజనాలు చేస్తూ ఉంటే కొంచెం నాజూగ్గా మాట్లాడలేరూ?" అని గదమాయించింది. దొడ్డి నుండి విరేచనం అయింది, విరేచనం నుండి బవెల్ మూవ్‌మెంట్ దాకా వచ్చేం కదా. కొన్నాళ్ళకి ఆ ఇంగ్లీషు మాట కూడా వినటానికి అసహ్యం వెయ్యటం మొదలు పెట్టింది. అందుకోసమని మా ఆవిడ దానికి కొత్త పేరు పెట్టింది, "బి. ఎం". మా పిల్లలు చిన్నప్పుడు "బి. ఎం" అన్న మాటని సరిగ్గా అనలేక "బీమా" అనటం మొదలు పెట్టేరు.

నా ఎరికని తెలుగు మీద అభిమానం ఉన్న ఒక ఇన్సూరెన్సు ఏజెంటు ఒకాయన ఉండేవాడు. ఎప్పుడూ తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నించేవాడు. మా పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు నాకు ఇన్సూరెన్సు అమ్మటం తేలిక అనుకున్నట్లున్నాడు. "బీమా" కొనమని మొహమాట పెట్టేసేడు. బీమా అంటే ఇన్సూరెన్సు అనే అర్ధం తెలుగులో ఉందని మా ఆవిడకి తెలియదు. "బీమా" ఎందుకు అమ్ముతాడా?" అని చాలా తికమక పడిపోయింది.

ఇలా మాటల అర్ధాలు మారుతూనే ఉంటాయి కనుక, "అన్నమైతే నేమిరా, సున్నమైతే నేమిరా ఈ పాడుపొట్టకి అన్నమే వేదామురా" అన్నట్లు, "ఇంగ్లీషు అయితేనేమి, తెలుగు అయితేనేమి, మన రోజు గడవటానికి తెలుగులోనే మాట్లాడుకుందామురా అంటాను నేను. మీరేమంటారు?.

ఆధారం. ఆచార్య తూమాటి దొణప్ప రాసిన "తెలుగులో అర్ధ విపరిణామం" అనే వ్యాసం