Friday, February 13, 2009

మాటల అర్ధాలలో వచ్చే పెను మార్పులు

ఫిబ్రవరి 2008

కాలం నడుస్తూన్నకొద్దీ భాష మారుతుంది. కనీసం అరవై ఏళ్ళు పైబడ్డవాళ్ళు ఈ దృగ్విషయాన్ని (phenomenon) తమ తమ అనుభవాల్లోనే చూసి ఉంటారు. ఈ మార్పులకి అనేక కారణాలు ఉండొచ్చు.

అలాగే ఒక భాషనుండి మరొక భాషలోకి మాటలు వెళ్ళినప్పుడు ఆ మాట ఉచ్చారణలోనూ, వర్ణక్రమంలోనూ, అర్ధంలోనూ కూడా మార్పుకి గురికావచ్చు. రెండు మూడు భాషలతో పరిచయం ఉన్న వాళ్ళకి ఈ విషయం అవగతం అవుతుంది.

కొన్ని ఉదాహరణలు: సంస్కృతంలో "అదృష్టం" అంటే కనబడనిది. తెలుగులో కలిసి రావటం. సంస్కృతంలో "అనుమానం" అంటే evidence. ఉదాహరణకి, ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, వగైరా. తెలుగులో ఈ మాటకి "సందేహం" అని అర్ధం. సంస్కృతంలో "ఉద్యోగం" అంటే పూనిక లేదా effort. "ఉద్యోగ విజయాలు" అన్నప్పుడు ఈ సంస్కృత అర్ధమే చెప్పుకోవాలి. తెలుగులో ఉద్యోగం అంటే జీవనోపాధికి చేసే పని. స్థూలంగా చూస్తే రెండు అర్ధాలూ ఒకటే కాని సందర్భానుసారంగా అర్ధంలో కొద్ది మార్పు వచ్చింది.

సంస్కృతంలో "గ్రహచారం" అంటే గ్రహాల కదలిక. తెలుగులో "వాడి గ్రహచారం అలా తగలడింది" అంటే వాడి "అదృష్టం" బాగులేదని. ఇక్కడ గ్రహచారం అంటే fate అనే అర్ధం స్పురించటమే కాకుండా ఆ fate బాగులేదని కూడా అర్ధం వస్తోంది. ఎందుకు ఈ మార్పు ఇలా జరిగిందీ అని ఆలోచిస్తే మన జాతకాలలో గ్రహాల పాత్ర ఉందనే నమ్మకమే దీనికి కారణం. ఆ నమ్మకం లేకపోతే ఈ మార్పు జరిగి ఉండేది కాదు.

సంస్కృతంలో "పూజ్యం" అంటే పూజనీయం, పూజించదగ్గది. తెలుగులో "శూన్యం, సున్న, ఏమీలేదు" అనే అర్ధం. ఈ మార్పు ఎలా వచ్చిందో అర్ధం కాలేదు.

సంస్కృతంలో "ముష్టి" అంటే పిడికిలి (ముష్టి యుద్ధం). పిడికెడు గింజలు వేస్తారు కనుక తెలుగులో "బిచ్చం" అనే అర్ధంలోకి దిగజారింది.

తెలుగులో పూర్వం "అవ్వ" అంటే తల్లి. ఇప్పుడు నాయనమ్మ లేక అమ్మమ్మ అనే అర్ధం. లేకపోతే ఏ ముసలిదానినేనా అవ్వ అనొచ్చు. "కంపు" అంటే కమ్మటి వాసన అని ప్రాచీనార్ధం, ఇప్పుడు చెడు వాసన. తగవు అంటే న్యాయం అని పూర్వకాలపు అర్ధం, జగడం, వివాదం అని నేటి అర్ధం.

కోక అంటే ఆడ, మగ ధరించే బట్ట. "కుల్లాయించితి, కోకజుట్టితి.." ఇప్పుడు కోక అంటే చీర. చీర అన్న మాట కూడా ఆడ, మగ ధరించే బట్టకి వాడేవారు. అదికూడా ఇప్పుడు స్త్రీ ధరించే వస్త్రమే.

ఇంగ్లీషులో కూడ ఇటువంటి అర్ధ విపరిణామం తప్పదు. నేను అమెరికా వచ్చిన కొత్తలో gay అంటే happy అని అర్ధం. ఇప్పటి కొత్త అర్ధం అందరికి తెలుసు.

ఈ ఉదాహరణలని బట్టి నాకు తెలిసినదేమిటంటే దేశ, కాల పరిస్థితులతో మాటు మాటల అర్ధాలు మారుతాయి; ఆడువారి మాటలకే కాదు, అందరి మాటలకీ అర్ధాలు మారుతాయి. కొంచెం వైజ్ఞానిక దృష్టితో పరిశీలించాలంటే ఈ మార్పుని రకరకాల కోణాల నుండి చూడవచ్చు.

అర్ధం వ్యాకోచించటం:

చెంబు అంటే ఎర్రటి లోహంతో చేసిన రాగి పాత్ర అని అసలు అర్ధం. ఇప్పుడు కంచు చెంబు, ఇత్తడి చెంబు, వెండి చెంబు, అంటూ అన్ని రకాల పాత్రలకీ వాడుతున్నాం కదా. కాని చెంబు అంటే ఒక రకమైన ఆకారం మన బుర్రలో పడిపోయింది: గుండ్రంగా, చలివిడి ముద్ద ఆకారంలో, ఉంటే చాలు అది ఏ పదార్ధంతో చేసినా చెంబే. కొన్నాళ్ళు పోతే ప్లేస్టిక్ చెంబులు వచ్చినా వస్తాయి.

నూనె అన్న మాట నూ + నెయ్ అనగా నువ్వుల నుండి తీసిన "నెయ్యి" లేదా చమురు. (నూ పప్పు అంటే నువ్వుల పప్పు అని అర్ధం ఉంది కదా.) ఇప్పుడు ఏమయిందీ? "నెయ్" ని నెయ్యి చేసి అది వెన్న కరిగించగా వచ్చిన చమురు కి వాడటం మొదలు పెట్టేం. "నూ" కాస్తా "నూనె" అయింది. ఈ నూనె నువ్వుల నుండే రానక్కరలేదు. వేరుసెనగ, ఆముదం, నిమ్మగడ్డి, పత్తి గింజలు, ఇలా ఎక్కడ నుండి లభించిన చమురయినా నూనే. అంతే కాదు; మట్టి నూనె, కిరస నూనె అన్న పదాలు కూడ వాడుకలోకి వచ్చేసేయి కదా.

ఈ పద్ధతి సంస్కృతంలో కూడ పని చేస్తుంది. తిలలు నుండి తీసిన చమురు తైలం. కర్పూర తైలం, ఏరండ తైలం, మృత్తిక తైలం, వగైరాలు తిలలు నుండి రాలేదు కదా. ఈ తైలం అన్న మాట యొక్క అర్ధం ఇంకా విస్తృతం అయి "లంచం" అనే అర్ధంలో కూడ వాడబడుతోంది. ఈ విపరీత పరిణామానికి కారణం ఇంగ్లీషు భాషా ప్రభావం అని నా అనుమానం. ఇంగ్లీషులో "grease the palms" అనే పదబంధం ఉంది. ఇది మన నుండి వారికి వెళ్ళిందో వారి నుండి మనకి వచ్చిందో తెలియదు కాని రెండు భిన్న సంస్కృతులవారు "తైలం" అర్ధాన్ని ఒకే దిశలో వ్యాపింపచెయ్యటం కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే.

పోతే, సంస్కృతంలో చేటిక అంటే దాసి అనే పరిమితార్ధమే ఉంది. అది తెలుగులోకి వచ్చి "చేడియ" గా మారి అర్ధంలో విస్తృతి పొంది ఇప్పుడు ఏ స్త్రీ నయినా సూచించటానికి వాడబడుతోంది. మనం ఈ రెండింటిని ఎక్కువగా వాడటం లేదు కనుక సరదాగా stewardess అన్న మాటకి "చేటిక" అనో, చేడియ అనో అంటే బాగుంటుందేమో!

అర్ధ సంకోచం:

కోక, చీర అన్న మాటలు ఇప్పుడు ఆడువారి వస్త్రాలకే పరిమితి కావటం ఒక ఉదాహరణ.

పారశీక భాషలో "ఉస్తాద్" అంటే ఉపాధ్యాయుడు. ఇది తెలుగులో "వస్తాదు" గా మారింది. మొదట్లో ఈ మాటని మల్ల విద్య బోధించే వారికి వాడేవారు. క్రమేపీ మల్లవిద్యతో సంబంధం లేకపోయినా "ప్రవీణుడు" అనే పరిమితార్ధానికి దిగజారిపోయింది. ఉదాహరణ: ఉస్తాద్ ఆలీ అక్బర్ ఖాన్.

సభ్యోక్తులు

కొన్ని మాటలు అశుభ సూచకాలు కావచ్చు. కొన్ని అశ్లీల పదాలనిపించవచ్చు. ఏడు ని ఆరున్నొక్కటి అనటం, "లేవు" అనటానికి "నిండుకున్నాయి" అనటం ఈ జాతివి.

ఇక్కడ అసభ్యోక్తుల గురించి సోదాహరణంగా రాయబోతున్నాను కనుక అభ్యంతరం ఉన్నవారు ఇటుపైన చదవకండి. మీకు కోపం వస్తే నన్ను మన్నించెయ్యండి - ఈ సారికి.

కొన్ని మాటలు తెలుగులో అంటే మరీ నాటుగా ఉంటుందని సంస్కృతంలోనో, ఇంగ్లీషులోనో అంటూ ఉంటాం. ఉచ్చ అన్న మాట అనటానికి ఇచ్చగించనివారు ఒంటేలు అనో, ఒకటికి అనో, అల్పాచిమానం అనో అంటూ ఉంటారు.

"మా దొడ్లో కాసిన కూరగాయలు" అన్నప్పుడు పరవా లేదు కాని చెంబుచ్చుకుని బయటకి వెళ్ళేటప్పుడు "దొడ్డికి వెళుతున్నాను" అంటే నాటుగా ఉంటుందని మా ఇంట్లో అంటారు. మలమూత్రాదుల విసర్జన శరీర కర్మలు; వాటి గురించి మాట్లాడటానికి మనవాళ్ళకి సిగ్గు, అందుకని ఇంగ్లీషులో లంకించుకుంటారు. మా పెద్ద సంతానం పుట్టినప్పుడు "పిల్ల దొడ్డికెళ్ళింది" అంటే మా ఆవిడ ఛర్రుమని లేచేది (ఇంకెవరి మీదకి, నా మీదకే!) "డయపరు పాడు చేసుకుంది" అనలేరూ?" అని గదమాయించింది. "డయపరు రెండు విధాలుగా పాడు చేసుకోవచ్చు కదా?" అని నేను సందేహం వెలిబుచ్చితే, "ఒకటికి వెళితే తడిపేసుకుంది" అనండి!" అంది. నేను కంప్యూటరు వాడినేమో, నాకిచ్చే ఆదేశాలు సందిగ్ధం లేకుండా ఉండాలి. అందుకని, "మరి రెంటికి వెళితేనో?" అనడిగితే, "దానిని బవెల్ మూవ్‌మెంటు అయింది" అనండి అని నాకు మాట్లాట్టంలో మెళుకువలు నేర్పింది.

ఒక రోజు ఎవ్వరో బంధువులు ఇంటికి వచ్చేరు. అంతా భోజనాలు చేస్తున్నారు. తల్లికి శాపం ఉందిట. నోట్లో ముద్ద పెట్టుకోగానే "పిల్లకి బవల్ మూవ్‌మెంటు అయింది. భోజనాలు అయేదాకా ఆగుదామా?" అని అమాయకంగా అడిగేను. ఆలస్యం చేస్తే పిల్ల పిర్రలకి "రేష్ వస్తూందేమో అని భయం. (ఇక్కడ పిర్రలు అనొచ్చో అనకూడదో? ఒక సారి "పిర్రలు" అని ఒక తెలుగు కథలో వాడితే, "మరీ un-victorian గా ఉంది, పిరుదులు అనో, బటక్స్ అనో మార్చుదురూ" అని ఒకరు సలహా ఇచ్చేరు.)

"అదేమిటి. అసహ్యంగా! అందరూ భోజనాలు చేస్తూ ఉంటే కొంచెం నాజూగ్గా మాట్లాడలేరూ?" అని గదమాయించింది. దొడ్డి నుండి విరేచనం అయింది, విరేచనం నుండి బవెల్ మూవ్‌మెంట్ దాకా వచ్చేం కదా. కొన్నాళ్ళకి ఆ ఇంగ్లీషు మాట కూడా వినటానికి అసహ్యం వెయ్యటం మొదలు పెట్టింది. అందుకోసమని మా ఆవిడ దానికి కొత్త పేరు పెట్టింది, "బి. ఎం". మా పిల్లలు చిన్నప్పుడు "బి. ఎం" అన్న మాటని సరిగ్గా అనలేక "బీమా" అనటం మొదలు పెట్టేరు.

నా ఎరికని తెలుగు మీద అభిమానం ఉన్న ఒక ఇన్సూరెన్సు ఏజెంటు ఒకాయన ఉండేవాడు. ఎప్పుడూ తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నించేవాడు. మా పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు నాకు ఇన్సూరెన్సు అమ్మటం తేలిక అనుకున్నట్లున్నాడు. "బీమా" కొనమని మొహమాట పెట్టేసేడు. బీమా అంటే ఇన్సూరెన్సు అనే అర్ధం తెలుగులో ఉందని మా ఆవిడకి తెలియదు. "బీమా" ఎందుకు అమ్ముతాడా?" అని చాలా తికమక పడిపోయింది.

ఇలా మాటల అర్ధాలు మారుతూనే ఉంటాయి కనుక, "అన్నమైతే నేమిరా, సున్నమైతే నేమిరా ఈ పాడుపొట్టకి అన్నమే వేదామురా" అన్నట్లు, "ఇంగ్లీషు అయితేనేమి, తెలుగు అయితేనేమి, మన రోజు గడవటానికి తెలుగులోనే మాట్లాడుకుందామురా అంటాను నేను. మీరేమంటారు?.

ఆధారం. ఆచార్య తూమాటి దొణప్ప రాసిన "తెలుగులో అర్ధ విపరిణామం" అనే వ్యాసం

17 comments:

  1. Plastic chembulu chala years back ee vachesayi, ippudu vatini plastic mugs replace chesayi :)

    ReplyDelete
  2. ఈ అంశం మీద ఇంకా చాలా రాయొచ్చని, రాస్తే చాలా ఆసక్తికరంగా మారుతుంది అని ఇప్పుడే తెలిసింది...చెప్పాలి అంటే ఈ అంశం మీద ఒక పీ.హెచ్.డీ చెయ్యొచ్చునేమో, ఇంతమటుకు ఎవరూ చెయ్యకపోయుంటే....మీ వివరణలు చూసాక నాకో ఆలోచన వచ్చింది సర్...ఆ ఆలోచన మొత్తం ఒక రూపు దిద్దుకున్నాక చెబుతాను..

    ReplyDelete
  3. మీ చమక్కులు బాగున్నాయ్ :-)

    ReplyDelete
  4. హహ్హహ్హ...
    ఒక అరగంట క్రితం మా పైఇంట్లోవున్న ఒక చిన్నపిల్ల తన చెల్లెలి గుఱించి ఒక సంగతి చెప్పింది, "మొన్న అదిగో ఆ టేబుల్ మీద పార్టీ చేసింది" అని. పార్టీ చెయ్యడమంటే ఏమిటి అన్నాను. "నేనక్కడ హోంవర్కు చేస్తాను రోజూ, ఆ టేబుల్ మీద పార్టీ చేసేసింది" అంది. నా ముఖకవళికల్లో మార్పురాకపోవడం గమనించి, "ఇప్పుడు బాత్రూమ్‌లో చేస్తోంది చూడు, అది" అన్నాకగానీ నాకర్థంకాలేదు. చూడండి ఇప్పుడు బీ.ఎం కూడా పోయింది. 'పార్టీ' అనే పదానికి అర్థవిస్తృతిగా దీన్ని ఉదహరించవలసివస్తుంది త్వరలో. :)

    అన్నమైతేనేమిరా మరి సున్నమైతేనేమిరా
    అందుకే ఈ పాడుపొట్టకు అన్నమేవేతామురా
    ఎప్పుడో విన్నానీ జానపదగేయం. భలే గుర్తుచేశారు.

    తెలుగు అయితేనేమిరా మరి ఆంగ్లమైతేనేమిరా
    అందుకే ఈ పాడుజన్మకు తెలుగులో మాటాడరా
    అని పేరడీగా పాడుకుందాం.

    మొన్నొక తెలుగాయన నాతో ఇంగ్లీషులో మాట్లాడుతున్నాడు. నేను తెలుగులో జవాబిచ్చాను. ఆయన ఇంగ్లీషులోనే ఇంకో ప్రశ్న అడిగాడు. నేను తెలుగులోనే జవాబిచ్చాను. ఇలా చాలాసేపు జరిగింది. ఆయన తెలుగులోకి వస్తాడేమోనని, రావాలని నా పట్టుదల. చివరికి ఆయనే జయించాడు. 'గుండెమంటలారిపే చన్నీళ్లు' కారుస్తూ 'ఉండమన్న ఉండకుండా' వచ్చేశాను.

    ఆచార్యా, కథను కధ అనేవాళ్లూ అర్థాన్ని అర్ధం అనేవాళ్లూ ఎక్కువైపోయారు. మీ టపా చదివాక నేనీ విషయంలో ఆశ వదులుకున్నాను.

    మారుతుందోయ్ ధర్మము మారుతుందోయ్ ధర్మము
    యుగయుగమ్ముల లోకవర్తన తగిన రీతిని మారుతుంది
    అని పాడుకుంటానిక. :)

    ReplyDelete
  5. నిజమే వంశీ గారన్నట్లు ఈ విషయం మీద ఓ పీ.హెచ్.డి చేయవచ్చు.

    @రానారె గారు, అది 'party' కాదు 'potty'. ఈ 'potty training' గురించి అమెరికాలో తల్లిదండ్రులకి క్లాసులు జరుగుతుంటాయి!

    ReplyDelete
  6. రానారె గారూ,
    మీ స్పందన అద్భుతంగా ఉంది. నలభయ్ ఏళ్ల క్రితం, 1967 లో అనుకుంటా, కేలిఫోర్నియాలో ఒక తెలుగావిడ (ఇప్పుడు "ఆవిడ" కానీ అప్పుడు కొత్తగా పెళ్ళి చేసుకుని అమెరికా వచ్చిన తెలుగు అమ్మాయే) నాతో అన్న "మాట" - మక్కీకి మక్కీ జ్ఞాపకం ఉంది - కాసుకొండి, చెబుతా:
    "మా హసుబెండు గారు ఇంగ్లీషులోనే కాని తెలుగులో థింకు కూడా చెయ్యలేరంటే మీరు బిలీవు చెయ్యగలరా?"
    ఆమె గుంటూరు నుండి అమెరికా వచ్చి గట్టిగా ఒక ఏడాది కాలేదు - పోనీ అమెరికా అలవాటయిపోయి తెలుగు అలవాటు తప్పిపోయిందేమో అనుకుందుకి!

    ReplyDelete
  7. "మా హసుబెండు గారు ఇంగ్లీషులోనే కాని తెలుగులో థింకు కూడా చెయ్యలేరంటే మీరు బిలీవు చెయ్యగలరా?"

    కెవ్‌వ్‌వ్‌వ్ కేక. :rofl:

    Rao garu, please remove word verification during the comments posting, if possible.

    ReplyDelete
  8. "Rao garu, please remove word verification during the comments posting, if possible."

    I do not understand what this above comment means. What is word verification and how do I remove it? Why should I remove it?

    ReplyDelete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. Word verification అంటే బ్లాగులో వ్యాఖ్య రాసేప్పుడు బ్లాగర్ ఒక గజిబిజి అక్షరాల పదం ఇచ్చి దాన్ని టైపు చెయ్యమంటుంది (వ్యాఖ్య రాసేవాళ్ళు మనుషలని నిర్ధారించుకునేందుకు). అది ఉండటం వల్ల వ్యాఖ్య రాసే వారికి చిరు ఇబ్బంది. కానీ, అది లేకపోతే బాట్లు కూడా వచ్చి (స్పాము) వ్యాఖ్యలు రాసే అవకాశముంది.

    ReplyDelete
  11. సిరిసిరిమువ్వగారూ, ఓహో... అది potty అన్నమాట. థాంక్యూ. మరికొన్నాళ్లకు ఈ potty ఏమౌతుందో! :)

    వేమూరిగారూ, :-))) @ "కాసుకొండి, చెబుతా"
    మరి ఇలాంటివి మక్కీకిమక్కీ శాశ్వతంగా గుర్తుండిపోక?! :-)))

    ReplyDelete
  12. ఈ సంస్కృత పదాల వాడకతో నేనూ కాస్త ఇబ్బంది పడ్డాను. ఉత్తరాది వెళ్ళినప్పుడు హిందీలో మాట్లాడడానికి తెలుగు సంస్కృత పదాల చివరి అం తీసేసి చకచక మాట్లడేస్తూంటాను. స్నాన్, భోజన్, సత్య్, సఫల్, సరోవర్ వంటి మాటలు విని "అబ్బో వీడు శుద్ధ్ హిందీ మాట్లాడతాడే" అనుకునేవారు. కానీ ఒక సారి ఉద్యోగ్ అని వాడితే వారికి అర్థం కాలేదు. ఇప్పుడు తెలిసింది ఎందుకో. అదృష్టం అంటే మా తెలుఁగు పంతులుగారు చిన్నప్పుడు అసలు అర్థం చెప్పారు కాబట్టి, హిందీలో సౌభాగ్య్ అనే వాడేవాడిని.

    అలానే కన్నడ మాట్లాడేటప్పుడు కూడా, అం బదులు అ చేర్చి రెచ్చిపోతూంటాను. స్నాన, భోజన, సత్య, సఫల వంటివి. అక్కడ కూడా కొన్ని చిక్కులు ఎదురయ్యేవి. వాళ్ళ వాడుకలో అభ్యాస అంటే అలవాటు అని.

    ఇక అన్నిటికంటే పెద్ద చిక్కు వచ్చింది మలయాళీ పిల్లతో నొకసారి "మీ చుట్టాల్లో నాకు ఏదైనా సంబంధం చూడు" అని అన్నప్పుడు. వాళ్ళ దృష్టిలో సంబంధం అంటే అక్రమ సంబంధం అని లెక్కంట! అప్పటినుండీ తెలుఁగేతర భారతీయులతోఁ సంస్కృత పదాల వాడకలో కాస్త జాగ్రత్త వహిస్తూంటాను.
    (మనలో మన సీక్రేట్, ఆ పిల్లతో ఆ మాట అనే ముందే నాకు సంబంధం వ్యవస్థ గుఱించి తెలుసును. కానీ ఆ పిల్ల రియాక్షన్ ఎలా వుంటుందోనని అడిగి, ఆమె ఛిఛీ అన్న తఱువాత "అయ్యో అవునా అసలు సంస్కృత అర్థం అది కాదే" అని వంక పెట్టాను.)

    ReplyDelete
  13. దొడ్డి వంటి మాటలకు ఆంగ్ల పదాలు వాడినా ఏదో పోనీలే అనుకోవచ్చు. కానీ మంచి తెలుగు పదాలు వున్నా ఆంగ్ల పదాలు వాడుతున్నారు.

    నేనీ మధ్యన మా నాన్నమ్మ అమ్మమ్మలతో నెక్కువగా మాట్లాడుతున్నాను (మంచి తెలుఁగు వస్తుందని). అలా నేర్చిన పదజాలాన్ని ఎప్పుడైనా లంగా-బాడి, సూలింతరాలు, దొడ్డి, రంకు వంటి మాటలుగా ప్రయోగిస్తే జనాలు బిత్తర పోతున్నారు. ఛిఛీ అమెరికాలో చదువుకొనివచ్చి ఆ మాటలేమిటిరా అని. ఏదో అమెరికా వెళ్ళింతరువాత తెలుఁగు భష గుర్తుండడమే పాపం అన్నట్టు!

    "మా పాప పెగ్నెంట్" అండి అంటే, నాకు కళ్ళు తిఱుగుతుంటాయ్.
    "ఇక మీ మిస్సెస్సు వచ్చారా?" (ఇంకా నయ్యం మిస్ట్రెస్ అనలేదు).
    "ఎవరికైనా చెప్పుకంటే ఇన్సల్టీ, అని ఎవరికీ చెప్పలేదు". (సిగ్గుచేటుకి న్యూతెలుగు పదం అనుకుంట ఇన్సల్టీ.)
    "నన్ను మిస్ అయ్యావా" (అబ్బే లేదు మిసస్స్ అయ్యాను)

    తాడి తన్నేవాడి తలదన్నేవాడన్నట్టు, మొన్నక పెళ్ళిలో కెళితే ఒకాయన కేవలం ఆంగ్లం లోనే మాట్లాడుతున్నాడు.
    "నేను English లోనే speak చేయాలని decide అయ్యాను".
    "ఓ ఔనా ఎందుకండి"
    "తెలుగులో speak చేస్తుంటే bad words ఏ coming. That is reasonnu".
    ఇఱుభాషలూ వచ్చిన నేనే ఈ ద్విభాషాత్యాచారానికి ప్రక్కనే వున్న స్తంభానికి తల గుద్దుకుంటుంటే, ఇక ఆంగ్లేయులు ఈ ఆంగ్లాన్ని విని ఆత్మహత్య చేసుకుంటారేమో.
    వెనక్కి తిఱిగి, ఆయ్యా తఁవరు ఆంగ్లంలో నింకా ఎక్కువ బూతులు మాట్లాడుతున్నారండి అని చెబుదామనిపించింది గాని, మొగ పెళ్ళివారయితే గొడవలవుతాయని ఊరుకున్నాను.

    తెలుఁగు మీద ఏమాత్రం అభిమానం వున్నా - ఈ కాలంలో పుట్టడం ఒక శాపమే. ఏదో ఇలా టపాలూ, వ్యాఖ్యలూ వ్రాసుకొని పరస్పరం పరామర్శించుకోవలిసిందే.

    @ రానారె,
    మీరు జరిగిన ఆంగ్ల-తెలుగు సంభాషణ నాకు ఈ అనుభవాన్ని గుర్తు తెచ్చింది.

    ReplyDelete
  14. రాకేశ్వరరావు గారు
    మీరు సూచించిన g-mail చిరునామాకి వార్త పంపితే తిరిగి వచ్చేసింది. పేరు వర్ణక్రమం సరిగ్గా రాసి ఉండను.

    ReplyDelete
  15. "దొడ్డి"కి వస్తుంది", అని చెప్పాలమ్మా అని పిల్లకి చెప్పినప్పుడు, నోరుతిరగక "డగ్గుల్" వస్తోంది" అంటూ తన పరిస్థితిని సూచించినప్పుడు నవ్వుకునేవారు. ఆ "డగ్గుల్" ఆ నోట, ఈ చెవిన పడి చాలా దూరం పాకింది. అలాగే ఈ వ్యాఖ్య ద్వారా ఎంత దూరం వెడుతుందో!
    "నిండుకున్నాయి" అనే సందర్భంలో "పొయ్యిలో పిల్లి లేవడం" కూడా కష్టం.
    "సాల్ట్ బటఱ్ బిస్కట్"లు కూడా!

    ReplyDelete
  16. రావు గారు,

    చాలా విషయాలు తెలిసాయండి మీ ఈ టపాలో. నాకు కూడా పదాల అర్థాల విషయంలో ఇటువంటి సందేహాలు కలుగుతుంటాయి. ఇప్పుడిక మీవంటి పెద్దల బాగ్లోకాగమనంతో ఆ సందేహాలు తీరే అవకాశం చిక్కినట్లే.

    నాకు చాలా రోజులుగా "ఉచితము" అన్న పదం తెలుగులో "free" అన్న అర్థంలో ఎందుకు వాడుతామో తెలుసుకోవాలనుంది. ఉచితము అన్న పదం అసలు వాడుక, "appropriate" అన్న అర్థంలో కదా, (ఉచితము X అనుచితము), మరి ఈ "చీర కొంటే జాకెట్టు గుడ్డ ఉచితం" అన్న అర్థంలో వాడడం ఏమిటి? "ఆ ఇచ్చావులేవోయ్ పెద్ద గొప్ప ఉచిత సలహా" అన్న వాడుకలో "ఉచిత" అన్న పదం ఏ అర్థాన్ని సూచిస్తుందో అని అనుమానం. తెలుగులో "free" అన్న అర్థంలో వాడగలిగే వేరే పదమేదయినా ఉందా?

    అన్నట్టు, మీ విద్వత్తు గురించి నేనిదివరకే ఎరిగున్నాను. మీ జీవనది పుస్తకాన్ని అంతర్జాలంలోంచి దిగుమతి చేసుకుని చదివాను, చదివి ఎంతో తెలుసుకున్నాను. ఇప్పుడు మీ బ్లాగులను కూడా చదువుతున్నాను.

    మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
  17. శ్రీహర్షా:

    ఉచితానుచితాలమీద మీ సందేహాన్ని తీర్చటానికి కొంచెం వ్యవధి కావాలి. పరిశోధన చేసిన పిమ్మట చెబుతాను. ఈ లోగా పాఠకులకి ఎవ్వరికయినా తెలిస్తే సందేహం తీర్చగలరు!

    ReplyDelete