Wednesday, February 11, 2009

అచ్చుతప్పులు


ఫిబ్రవరి 2009

కూడలి మొదటి పేజీలో గత నెల్లాళ్ళబట్టీ typo కి టైపాటు ("టైపు చెయ్యటంలో పొరపాటు") అనే మాటని వాడమని సలహా ఇస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాలు చేస్తేనే కదా ఆ మాట ఆదరణ పొందుతున్నాదో లేదో తెలిసేది? కనుక ఆ ప్రయోగం తలపెట్టినవారికి ముందుగా నా జోహారులు!

తెలుగులో ఈ భావాన్ని ప్రస్పుటం చేసే మాటలు లేకపోలేదు. ఉదాహరణకి "అచ్చుతప్పులు" అన్న ప్రయోగమే ఉంది. ఈ మాటని మొదట్లో printing mistake అన్న భావానికి వాడినా, typing mistakes అన్న మాటకి కూడా సమానార్ధకంగా వాడవచ్చు. Typing, typesetting, printing" మొదలైన పనులన్నీ దరిదాపు ఒకటే.

మరికొంచెం సంస్కృతం కలిపి "ముద్రారాక్షసం" అని కూడా అనొచ్చు. ఈ ముద్రారాక్షసం అన్న పదబంధం ఇంగ్లీషులోని printer's devil అన్న పదబంధానికి మక్కీకి మక్కీ తెలుగు సేత. "అచ్చు తప్పు" అన్నా, ముద్రారాక్షసం" అన్నా భావం ఒకటే. వీటిని ప్రత్యామ్నాయాలుగా వాడుకోవచ్చు. లేదా ఒక సందర్భంలో అచ్చుతప్పు అనీ మరొక సందర్భంలో ముద్రారాక్షసం అనీ రూడ్యార్ధాలు కల్పించవచ్చు.

సంస్కృతం మీద ఆధారపడగానే దొరికే మరొక మాట "స్ఖాలిత్యం." స్ఖలనం అంటే stumbling, tripping అని ఒక అర్ధమూ, dripping, effusion, emission అని మరొక అర్ధమూ నిఘంటువులో ఉన్నాయి. పురుషుడి రేతస్సు ఉద్గమించటాన్ని కూడ స్ఖలనం అనే అంటారు కాని నిఘంటుకారుడు కొంచెం సిగ్గుపడి ఆ వివరణ ఇవ్వలేదు. కనుక స్ఖాలిత్యం అంటే error, mistake, omission, printer's mistake, printer's error అని నిఘంటువులో అర్ధాలు ఉన్నాయి. స్ఖాలిత్యం అన్నమాటకీ అచ్చుకొట్టటం అన్న ప్రక్రియకీ ఎక్కడా పోలికే లేదు. నోరుజారినా, కలం జారినా, పరాకుగా ఒక ఆలోచనకి సరిపడని మాట ప్రయోగం జరిగినా, ... ఇవన్నీ స్ఖాలిత్యాలే. కనుక స్ఖాలిత్యం అన్న మాటకి "అచ్చుతప్పు" అన్న మాట కంటె విస్తృతమైన అర్ధం ఉంది.

ఒకే భావానికి ఇన్ని మాటలు ఉంటే కవిత్వం రాయటానికి బాగుంటుంది కాని విజ్ఞాన, సాంకేతిక విషయాలు రాయటానికి నిర్దిష్టత ఉంటే బాగుంటుంది. కనుక నా సలహా ఏమిటంటే....

Typos, printing errors, printing mistakes,..." మొదలైనవాటికి అచ్చుతప్పులు, ముద్రారాక్షసాలు, కావలిస్తే టైపాటులు అన్న మాటలు సందర్భానుసారంగా వాడుకుని స్ఖాలిత్యాన్ని మరొక ప్రత్యేక సందర్భంలో వాడితే బాగుంటుందేమో. నాకు తెలిసినంతవరకూ స్ఖాలిత్యం అన్న ప్రయోగం అంత ఎక్కువ వాడుకలో లేదు కనుక దానికి కొత్త అర్ధాన్ని ఆపాదించటంలో ప్రమాదం ఉండదు. ఏమిటీ కొత్త అర్ధం? కలనయంత్రాలు (computers) ని వాడేటప్పుడు మనం క్రమణికలు (programs) రాస్తాం కదా. ఇవి రాసేటప్పుడు జరిగే తప్పులని ఇంగ్లీషులో bugs అంటారు. వాటిని పురుగులు, క్రిములు, కీటకాలు అంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. కనుక వాటిని మనం "బగ్గులు" అనే అంటున్నాం అనుకుంటాను. ఈ bugs ని స్ఖాలిత్యాలు అనమని నా సలహా.

ఇవి నిజంగా స్ఖాలిత్యాలే. మన మనస్సులో ఉన్న ఊహ ఆదేశాలు (instructions) రూపంలో ఘనీభవించి అక్షరాలలా రూపుదిద్దుకునే లోగా అనేక దోషాల వల్ల (తార్కిక దోషాలు, భాషా దోషాలు, మొ.) పొరపాట్లు జరగొచ్చు, లేదా పరాకు చిత్తగిస్తూ మనస్సులో అనుకున్నది ఒకటీ, కాగితం మీద (లేదా తెర మీద) పడేది మరొకటీ కావచ్చు. ఈ రకాల దోషాలన్నిటినీ కలిపి స్ఖాలిత్యం అని అంటే మనకి తెలుసున్న మాటకి రూఢ్యార్ధం, ప్రతేకార్ధం ఆపాదిస్తున్నామన్న మాట!

ఆలోచించండి.

9 comments:

  1. సర్

    స్ఖాలిత్యం అంటే ఒక చిన్న అనుమానం గుర్తుకు వచ్చింది...మీరు రాసినదానికి , దీనికి సంబంధం లేదనుకోండీ...అయినా అడుగుదాము అని అనిపించింది...

    "రేపు" అంటే ప్రాచీన భాషలో ఉదయమని అర్థం కదా...అలాటి రేపు కాస్తా ఇప్పుడు తరువాతి రోజు అనే అర్థం కిందకి వచ్చింది..అలాగే "కంపు" కి కూడా ప్రాచీన భాషలో "వాసనో / సువాసనో" అని వేరే అర్థం ఉన్నది అని ఎప్పుడో ఏదో పుస్తకంలో చదివినట్టు గుర్తు. మీకు "కంపు"తో సహా అలాటి పదాల అర్థాలు తెలిస్తే కొద్దిగా వివరిద్దురూ...

    "రేపు వెళ్ళి ఆ కిష్టమ్మకి రావద్దని చెప్పి వచ్చా" అంటే ఎంత గందరగోళం అవుతుందో, అలాగే "ఈ గులాబి పువ్వు కంపు కొడుతోంది" అంటే అంత గందరగోళంగానూ ఉంటుంది...

    ReplyDelete
  2. 'కంపు' అంటే 'సువాసన', కాలక్రమంలో దానికి వ్యతిరేకార్ధంలో స్థిరపడిందని డిగ్రీలో మా తెలుగు మేస్టారనేవారు. అదెంతవరకూ నిజమో తెలీదు నాకు.

    టైపాటు, ముద్రారాక్షసం, అచ్చుతప్పు, స్ఖాలిత్యం .. వీటన్నిటికన్నా ప్రాచుర్యమైనది మరోటుంది: 'అప్పుతచ్చు' :-)

    ReplyDelete
  3. ఆర్యా, ఒకటేమిటి! దీనిమీద పెద్ద వ్యాసమే రాయగలను. కనుక ఆ వ్యాసాన్ని మరొక బ్లాగులో బ్లాగించి, ప్రస్తుతానికి పబ్బం గడవటానికి, అర్జంటుగా కొన్ని ఉదాహరణలు:

    అదృష్టం: సం. కనబడనిది, తె. కలిసి వచ్చినది

    అనుమానం, సం. ఉదా. అనుమాన ప్రమాణం, తె. సందేహం

    ఉద్యోగం, సం. పూనిక, తె. జీవనోఫాధికి చేసే పని

    గ్రహచారం, సం. గ్రహాల కదలిక, తె. దురదృష్టం

    పూజ్యం, సం. పూజించదగ్గది, తె. శూన్యం

    ఇలా ఎన్నయినా చెప్పుకుపోవచ్చు

    కోక అంటే ఆడ, మగ ధరించే బట్ట. "కుల్లాయించితి, కోకజుట్టితి.." ఇప్పుడు కోక అంటే చీర.

    సభికులు = జూదగాళ్ళు, ఇప్పుడు గౌరవ పదం!

    ఇంగ్లీషులో కూడ ఇది తప్పదు. నేను అమెరికా వచ్చిన కొత్తలో gay అంటే happy అని అర్ధం. ఇప్పటి కొత్త అర్ధం అందరికి తెలుసు.

    ReplyDelete
  4. "కోక అంటే ఆడ, మగ ధరించే బట్ట. "కుల్లాయించితి, కోకజుట్టితి.." ఇప్పుడు కోక అంటే చీర"

    "చీర" అన్నా ఒకప్పుడు ఆడ, మగ ధరించే బట్టే!

    ReplyDelete
  5. కూడలి మొదటి పేజీలో గత నెల్లాళ్ళబట్టీ typo కి టైపాటు ("టైపు చెయ్యటంలో పొరపాటు") అనే మాటని వాడమని సలహా ఇస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాలు చేస్తేనే కదా ఆ మాట ఆదరణ పొందుతున్నాదో లేదో తెలిసేది? కనుక ఆ ప్రయోగం తలపెట్టినవారికి ముందుగా నా జోహారులు!

    తగలాల్సిన చోట తగిలిందండీ. (దాన్ని వారానికోసారి మార్చాలని నా అసలు ఉద్దేశం. కానీ బద్దకం.) మీ జోహారులకి నెనరులు. ఇప్పుడు మరో పదాన్ని ప్రదర్శనకు పెట్టాను. ఇక టైపాటు నిష్పాదన జరిగిన విధంబిదిగో!

    ReplyDelete
  6. రావు గారూ,
    నాకెప్పటి నుంచో మన తెలుగు కేలండరు ఎలా తయారు చేసారో తెలుసు కోవాలని కుతూహలంగా ఉంది.మీకు
    వీలయితే ఒక వ్యాసం వ్రాద్దురూ!!

    సత్తిబాబు.

    ReplyDelete
  7. తెలుగు పంచాగమా? ఇంగ్లీషు కేలండరా? ఇంగ్లీషు కేలండరు గురించి చాలా రాయగలను. (ఎప్పుడో ఏళ్ళ క్రితం ఇంగ్లీషులో రాసినది ఎక్కడా ప్రచురించ లేదు కనుక అది తెలుగులోకి మార్చి చెప్పగలను.) తిథులు, వర్జాలు, దుర్ముహూర్తాలూ, గ్రహణాలు ఎలా గణిస్తారో నాకూ తెలియదు. తెలిసిన బ్లాగర్లు మా అందరికీ అర్ధం అయేలా రాస్తే సంతోషిస్తాను.

    ReplyDelete
  8. ముద్రా అని ఒక అసురుడు వుండేవాడని, నేను ఇటీవలనే ఒక పురాణ గాధ చదివాను. దానిని శివుడో, శక్తో సంహరించడం జరిగింది.
    దానిని తరువాత printer's devil అనే అర్థంలో వాడుతున్నారేమో :)

    అన్నట్టు గురువుగారు,
    ఈపాటికి మీరు, వీడెవఁడు నా ప్రతి టాపాకి వచ్చి, పానకంలో పుడకలాగా అడ్డం వాదిస్తున్నాడు అనుకుంటున్నారేమో. నా తీరు అంతే లెండి కొద్దిగా. Georgia Techలో Signal Proc. లేదా DigiComm క్లాసుల్లో ఐదు నిమిషాలకోసారి professor అంటూ చేయి పైకి లేపేవాడిని :) ఈ మధ్యనే తెలుగు భాష మీద నాకు చేతనైన పరిశోధన మొదలు పెట్టాను. మీరు నాలుగేళ్ళ క్రితం తెలుఁగు బ్లాగు మొదలుపెట్టి వున్నా, లేదా UCD వారు నా MS అర్జీ తిరస్కరించకున్నా, మనకు ముందే పరిచయం అయివుండేది.
    ప్రస్తుతం కాళీగా వుండి, పిహెచ్‌డి కి వెళదామనుకుంటున్నాను. మీకు వీలైతే నాకు చిన్న మెయిలు పంపగలరు రాకేశ్వర్@జీమెయిల్.కామ్ (వర్ విత్ ఎ వి నాట్ డబ్యయూ)

    ReplyDelete
  9. కన్నడం లో కంపు అంటే సువాసన అని, వాసనె అంటే దుర్వాసన అని అర్ధం ;)

    ReplyDelete