Saturday, February 21, 2009

వంద అనాలా? నూరు అనాలా?

ఫిబ్రవరి 2009

ఈమధ్య అంకెల మీద మూడు బ్లాగులు రాసేను. ఆ సందర్భంలో చిన్న అనుమానం పుట్టి కుమ్మరి పురుగులా గొలకటం మొదలు పెట్టింది. తొంభయ్ తొమ్మిది తరువాత వచ్చే సంఖ్యని "వంద" అనాలా? నూరు అనాలా? లేక "వంద" అని కొన్ని సందర్భాలలోనూ, "నూరు" అని కొన్ని సందర్భాలలోనూ అనాలా?

మన సాహిత్యంలోనూ, సంప్రదాయాలలోనూ "నూరు" ఎక్కువగా కనిపిస్తుంది. "నూటపదహారులు", "నూటికీ కోటికీ", "నెలఒక్కంటికి నూటికి వడ్డీ", మొదలైన వాడుకలు దీనికి ఉదాహరణలు. లెక్కపెడుతూన్నప్పుడు "తొంభయ్ తొమ్మిది" తరువాత వచ్చేది "నూరు" - ఎందుకంటే నూరు తరువాత "వందొకటి, వందరెండు అని ఎవ్వరూ అనగా నేను వినలేదు. నూటఒకటి, నూటరెండు, ... నూట తొంభయ్ తొమ్మిది, అనే అంటాం. అటుపైన "రెండు నూర్లు" అనం, "రెండు వందలు" అంటాం. అటుపైన ఎంత పెద్ద సంఖ్య చెప్పవలసి వచ్చినా ఆ పదబంధంలో "వంద" వస్తుంది కాని "నూరు" రాదు: "పదహేరు వేల నాలుగు వందల పన్నెండు", పదహేరు వేల నూట పన్నెండు" ని పోల్చి చూడండి.

ఎందుకు ఈ నియమం వచ్చిందో తెలియదు. ఇది విచారించేలోగా ఈ "వంద" ఎక్కడనుండి వచ్చిందో చూద్దాం. నూరు-వంద పర్యాయ పదాలు అయినప్పటికీ "నూరు" పక్కా తెలుగు మాట, వంద సంస్కృతంలోచి దిగుమతి అయి, రూపాంతరం చెందిన మాట.

సంస్కృతంలో "బృంద" కి పర్యాయ పదమైన "వృంద" తెలుగులోకి వచ్చి "వంద" అయింది.
"బృంద" అంటే "మూక", లేదా, "ఒకటికి మించి ఎన్నో" అని అర్ధం. బృందగానం అన్న మాట ఈ బృంద లోంచే వచ్చింది. కనుక ఒక విధంగా చూస్తే, "వంద" అంటే "చాలా" అని అర్ధం.

మన తెలుగు వాళ్ళకి తెలుగు తప్పించి మరే భాషా పదమైనా ఇష్టమే కనుక, ఈ వెనకొచ్చిన "వంద" ముందొచ్చిన "నూరు" మీద తురుఫు ముక్కలా పని చేస్తోంది.

"మీరు మరీనండీ. శోద్యం కాకపోతేను. ఏదీ "పందొమ్మిదివందల నలభై ఏడు" ని "వంద" లేకుండా అనండి చూద్దాం" అని సవాలు చేసేడు మావాడొకడు. దీన్ని రాయలసీమలో "వెయ్యిన్నీ తొమ్మన్నూట నలభై ఏడు" అంటారు ట. సాగరాంధ్రుల చెవికి ఇది కొంచెం funny గానే అనిపిస్తుంది. కాని సాగరాంధ్రుల చెవికి తెలుగే funnyగా వినిపిస్తోందీ రోజుల్లో.

ఇంతకీ మనకి రెండు మాటలు ఉన్నాయి కనుక "వంద" ని ఏ సందర్భంలో వాడటమో, "నూరు" ని ఏ సందర్భంలో వాడటమో నిర్ణయించుకుంటే బాగుంటుందేమో. ఎవ్వరైనా సలహాలు ఉంటే పారెయ్యండి.

15 comments:

 1. బాగుంది. నా అభిప్రాయం:
  అందరూ "నూరు" అని ఏ సందర్భంలో అంటున్నారో మనమూ ఆ సందర్భంలోనే "నూరు" అందాము.
  అందరూ "వంద" అని ఏ సందర్భంలో అంటున్నారో మనమూ ఆ సందర్భంలోనే "వంద" అందాము.

  ReplyDelete
 2. >>"రెండు నూర్లు" అనం,
  అవును, నిజమే. "రెండు నూర్లు" అనం. కానీ ఇన్నూరు అంటాం. అలాగే మున్నూరు, నన్నూరు/నాలుగు నూర్లు, ఐదు నూర్లు, మొ.
  (ఉదా: సంవత్సరానికి మున్నూటరవై ఐదు రోజులు)

  ReplyDelete
  Replies
  1. ఇన్నూరు కన్నడంలో అంటారు

   Delete
 3. "బృంద"కీ "వందకీ" శబ్దసామ్యమే తప్ప అందులోంచి ఇది వచ్చిందని నేననుకోను. వంద కూడా అచ్చమైన తెలుగు పదమే. కాకపోతే మొదట్లో అదొక స్థానిక మాండలిక పదంగా ఉండి జాతీయ వాడుకగా పదోన్నతి పొంది ఇప్పుడు నూటి స్థానాన్ని ఆక్రమించుకొంది. ఒకసారి జనవాడుకలో స్థిరపడిపోయాక దాన్ని మార్చడం కష్టం. నా అనుమానం రెండు, మూడు అనే పదాలకీ ఇన్నూఱు, మున్నూఱు అనే సమాస రూపాలకీ మధ్య మానసికంగా స్విచ్ అవడం కష్టమనిపించే జనం అన్ని సందర్భాలకీ కలిపి సౌలభ్యంగా వంద వాడుకని అవలంబించారని ! చాలా ప్రాంతాల్లో తొంభైతొమ్మిది తరువాత వంద అనే అంటారు. నూఱు అని వాడగా ఈమధ్యకాలంలో వినలేదు.


  --తాడేపల్లి

  ReplyDelete
 4. త్రివిక్రం గారూ
  మీరు రాయలసీమవారు అయి ఉండాలి. గోదావరి జిల్లాలలో ఇన్నూరు, మున్నూరు వాడకం తక్కువే.

  ReplyDelete
 5. నేను కేరళ కణా౯టక దేశాల నుండా నాకు నూఱు అనే మాట ఎక్కువ వినిపించి, అది బాగా నచ్చడం మొదలయ్యింది. అప్పటినుండి నూటిని కొంత ఎక్కువగా వాడడం మొదలు పెట్టాను. అచ్చతెలుఁగుదనం కావాలన్నా వందకి నూఱు వాడాలనిపిస్తుంది. మీ బృంద కథ కూడా నాకు కాస్త ఫార్-పెచ్చుడు అనిపించింది :) కానీ ఈ సారికి నమ్ముదామని నిర్ణయించుకున్నాను.

  ------------------------------
  నా జీమెయిలు ఐడి rakesh var(మధ్య అంతరం లేకుండ). మీకు జరిగిన బౌన్సుకు క్షంతవ్యుడను.

  ReplyDelete
 6. తమిళ తంబీ అన్నాడు కదా, "..నూర్,నూత్తి ఒణ్ణు, నూత్తి రెండ్, నూత్తి ఐంబత్తి ఆరు...ఏళ్‌నూత్తి తొంబత్తి ఒమ్‌బోద్.."

  ReplyDelete
 7. నూర్రూపాయల కాయితం, వెయ్యిన్నూటపదార్ల సదింపులు(చదివింపులు), నూటికి నూరు మార్కులు, కౌరవులు నూరుగురు, నూటొక్క జిల్లాల అందగాడు, మున్నూరు మా(మి)డికాయ ...ఇవే కాని వంద అనేమాట మావూళ్లో నేనెప్పుడూ వినలేదు. ఊళ్లోకి టీవీలొచ్చినాక వంద వచ్చింది. కొందరికదే ఫ్యాషన్.

  ReplyDelete
 8. తూర్పుగోదావరి నీళ్లు చిన్నప్పటినుండి త్రావినవాడిని అవడంచేతనో మరొకటో మరొకటో తెలియదు కానీనండీ, నేను నూఱుకంటె వందనే ఎక్కువ వాడుతాను. బొత్తిగా వందొకటి అనకుండా నూటొకటి అనే అంటాననుకోండి. నేను చెప్పొచ్చేదేమిటంటే వచ్చినచోటా నచ్చినచోటా మాత్రం నాకు నూఱు వచ్చేస్తుంది వందని సున్నితంగా ప్రక్కకి నెట్టి. నేను ఆ భేదాన్ని పెద్దగా పట్టించుకోలేదు కూడాను మీరు ఇప్పుడు ఈ విషయం ఎత్తేవఱకు.

  ReplyDelete
 9. వంద అనే వారైనా వంద తర్వాత ఉండే అంకెలను నూటొకటి ,నూట రెండు అనే అంటారు ఎక్కడైనా సరే! వందొకటి వంద రెండు అనడం ఎక్కడా చూడం!

  రాయలసీమలో నూరు వాడకం ఎక్కువనుకుంటాను.

  నాకైతే వంద అనడమే హాయిగా, వీలుగా (అచ్చతెలుగుపదంగానే) ఉంటుంది.

  ReplyDelete
 10. వందనూర్ల వందనాలు..వంద గురించీ, నూరు గురించీ ఎంచక్కా రాశారు! వంద-వంద అని వందలసార్లు అంటే కష్టమని, మనవాళ్ళు నూరును కనుక్కొని ఉంటారు- లేదా, నూరు-నూరు అని నూర్లసార్లు అని అలిసిపోతారని వందని ప్రయోగించి ఉంటారు..మన సంతోషంకొద్దీ ఒక్కోసారి వంద అని, ఒక్కోసారి నూరు అని అనుకుంటుంటే చాలదూ? ఎవరో అన్నారట- 'ఏ రాయయితేనేం, పళ్లూడగొట్టుకోటానికి?' అని- మనం ఎలా పిలిచినా వంద నూరు కాకపోదు; నూరు వంద కాకపోదు- ఏమంటారు?

  ReplyDelete
 11. మా తాత గారు కూడా రెండు వందలను (సారీ :-) ) ఇన్నూరు, మూడు వందలను మున్నూరు, నాలుగు నూర్లు, ఇలా అంటూ ఉంటారు

  ReplyDelete
 12. కౌరవులు వంద మంది / నూర్గురు
  వందా ఒక్క జిల్లాల అందగాడిని / నూటొక్క జిల్లాల కి నూతన్ ప్రసాద్ ని
  వంద గొడ్లను తిన్న రాబందు / నూరు గొడ్లను తిన్న ...

  వాక్యం లో, వాడుకలో ఒదిగే అందమే నూరు ని ఓ మెట్టు పైన నిలబెట్టిందేమో!
  ఏ రాయైనా ఒకటే కానీ, 'అ ' కారం కంటే ' ఉ ' కారం సంధి కి సులువనుకుంటా. పండితులు చెప్పాలి, అవునో కాదో!

  సాగరాంధ్రుల చెవి కి తెలుగే ఫన్నీ గా వినిపిస్తోందని అనేసారేమిటండీ? ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?

  ReplyDelete
 13. బాగుందండీ! నాకెప్పటినుంచో ఇదే సందేహం ఉండేది. వంద తరువాత నూట ఒకటి అయితే రెండు వందల తరువాత రెండు నూర్ల ఒకటి ఎందుకు కాలేదా? అని :) నూటికీ, కోటికీ ఒక్కడు అన్న వాడుక కూడా ఉంది కదా! అలాగే ఇక్కడ వ్యాఖ్యల్లో త్రివిక్రమ్ గారు చెప్పిన మాటలు బహుశా తమిళం కలగలసిన ప్రాంతాల్లో వాడతారేమో అనిపించింది.

  ReplyDelete
 14. >> త్రివిక్రమ్ గారు చెప్పిన మాటలు బహుశా తమిళం కలగలసిన ప్రాంతాల్లో వాడతారేమో అనిపించింది.

  :-) రసజ్ఞ గారూ, మీరు 'తమిళం కలగలిసిన' అంటున్నది ఇన్నూరు, మున్నూరు అనే పదాల గురించేనా? మరైతే ఇరవై, ముప్ఫై ఏ ప్రభావమంటారు?

  ReplyDelete